శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు ======================== ‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి . ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ... శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు.
శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి... మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది.
అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.
శ్రీకాళహస్తి క్షేత్రం
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి. దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది.నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళినభక్తులు శ్రీవారి దర్శనం పూర్తికాగానే తిరుమలదగ్గరవున్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు.
ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్నతర్వాత మరేదేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు.అలా వెళ్ళితే అరిష్టమనేఆచారం హిందూ సాంప్రదాయంలో కొనసాగుతూవస్తూంది. అసలెందుకు అలా చేయాలి.
శ్రీకాళహస్తి దర్శనంతర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు?వెళ్ళితేఏమవుతుంది?నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి?తెలుసుకుందాం. పంచభూతాలనిలయం ఈ విశాలవిశ్వం.గాలి, నింగి, నేల,నీరు, నిప్పు.ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమిమీద పంచభూతలింగాలు వెలసాయి.అందులో ఒకటిగా చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ గాలిని స్మరించిన తరువాత ఏ ఇతరదేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం.అందుకే అందులో నిజంలేకపోలేదు.సర్పదోషం,రాహుకేతువుల దోషం ఇక్కడికివచ్చాక పూర్తిగా నాయమౌతుంది.
శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యస్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు.కారణం దోషనివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికివెళ్ళడమే. తిరిగి ఏ ఇతరదేవాలయాలకు వెళ్ళినా దోషనివారణ వుండదనేది అక్కడి పూజారులు చెబుతున్నారు. గ్రహణాలు, శనిబాధలు,పరమశివుడికి వుండవని మిగతాఅన్ని దేవుళ్ళకి, శనిప్రభావం, గ్రహణప్రభావం వుంటుందని చెబుతున్నారు.దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. ఈరోజున కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలతిరుపతి దేవస్థానంతో సహా అన్నిదేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణజరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు.కానీ గ్రహణ సమయంలో మాత్రం శ్రీకాళహస్తిదేవాలయం తెరిచేవుంటుంది.అంతేకాదు రోజంతా ప్రత్యేకపూజలు జరుగుతూనే వుంటాయి.
అందుకే ఇక్కడ దర్శనంచేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదన్నది నీతి. పురాణాల్లో శ్రీకాళహస్తి : ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు.
శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వవ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు. భక్త కన్నప్ప :శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరి లో ప్రస్తావించారు.
దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు, శివ భక్తులకు ఈ భక్తీ కథ బాగా తెలిసిందే. విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు.
చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తి లోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధాని కి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు. ఒక దివ్యమైన ప్రయాణానుభూతికాళహస్తి లోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడి ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.
కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి ?
ఈ పట్టణంలో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.
కాళహస్తి చేరుకోవడం : కాళహస్తి రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలికగానే చేరుకోవచ్చు. అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది.
ఎలా చేరాలి ? రోడ్డు మార్గం ద్వారా
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాళహస్తికి అనేక బస్సులు నడుపుతుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, నెల్లూర్ లాంటి నగరాలకు నిత్యం బస్సులు తిరుగుతాయి. శ్రీకాళహస్తికి ప్రైవేటు బస్సులు కూడా నడుస్తున్నాయి కానీ వాటి చార్జీ కొంచే౦ ఎక్కువే వుంటుంది.
రైలుమార్గం
బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో వుండడం వల్ల ప్రధాన రైళ్లన్నీ శ్రీకాళహస్తి లో ఆగుతాయి. ఈ పట్టణం నుంచి అనేక రైళ్ళ ద్వారా దక్షినాది లోని అనేక నగరాలకు అనుసంధానం వుంది. ఇతర స్టేషన్లలో రైళ్ళు మారకుండా నేరుగా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు.
వాయుమార్గం ద్వారా
శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ వుంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.